Rohit Sharma: ఓ నెట్ బౌలర్ విసిరిన బంతులకు అవాక్కయిన రోహిత్ శర్మ, ధావన్!

  • టీమిండియాకు నెట్స్ లో సాయం చేసిన కేశవ్ దబాస్
  • రోహిత్, ధావన్ ల వికెట్లు గిరాటేసిన టీనేజ్ బౌలర్
  • కోచ్ రవిశాస్త్రి అభినందన!

ఢిల్లీ వేదికగా రేపు బంగ్లాదేశ్ తో జరిగే మొదటి టి20 మ్యాచ్ కు టీమిండియా సన్నద్ధమవుతోంది. అరుణ్ జైట్లీ మైదానంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీసు చేస్తున్నారు. అయితే, ఓ నెట్ బౌలర్ టీమిండియా దిగ్గజ బ్యాట్స్ మన్లను సాధనలో ముప్పుతిప్పులు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా పెద్ద మ్యాచ్ లకు సన్నద్ధమయ్యే సమయంలో ఆటగాళ్లు నెట్స్ లో స్థానిక బౌలర్ల సాయం తీసుకుంటారు.

తాజాగా, కేశవ్ దబాస్ అనే టీనేజి బౌలర్ కూడా భారత బ్యాట్స్ మెన్ కు నెట్స్ లో బౌలింగ్ చేశాడు. 19 ఏళ్ల కేశవ్ బౌలింగ్ లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వంటి హేమాహేమీలు క్లీన్ బౌల్డ్ కావడం ఇతర ఆటగాళ్లను విస్మయానికి గురిచేసింది. కేశవ్ బౌలింగ్ ను అంచనా వేయడంలో ఈ ఇద్దరు విఫలమై బౌల్డ్ అయ్యారు. అక్కడే ఉన్న కోచ్ రవిశాస్త్రి కూడా కేశవ్ ను అభినందించినట్టు తెలిసింది.

ఇక, టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ ప్రత్యేకంగా కేశవ్ తో మాట్లాడుతూ, ఏ క్లబ్ కు ఆడుతున్నావు? అంటూ ఆరా తీశాడు. ఢిల్లీకి చెందిన కేశవ్ ఇటీవలే తండ్రిని కోల్పోయాడు. స్థానిక సురీందర్ ఖన్నా క్రికెట్ అకాడమీ జట్టుకు ఆడే ఈ యువ బౌలర్ గతంలో ఆస్ట్రేలియాతో వన్డే సందర్భంగా టీమిండియాకు నెట్స్ లో సాయం చేశాడు.

More Telugu News