Maharashtra: దారులన్నీ మూసుకుపోయిన తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నారు: బీజేపీపై సంజయ్ రౌత్ ఫైర్

  • రాష్ట్రపతి పాలన పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు
  • బెదిరింపులను మహారాష్ట్ర ప్రజలు పట్టించుకోరు
  • కూటమి ధర్మాన్ని పాటిస్తాం

మహారాష్ట్రలో నవంబర్ 7లోగా ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన తప్పదంటూ బీజేపీ నేత సుధీర్ ముంగంటివర్ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మీరు ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి, గవర్నర్ లకు ఉన్న అధికారాలను ఈ విధంగా ఎవరైనా దుర్వినియోగం చేస్తే... అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని చెప్పారు. బెదిరించి అధికారంలోకి రావాలనుకుంటే... దాన్ని మహారాష్ట్ర ప్రజలు ఏ మాత్రం పట్టించుకోరని చెప్పారు.

వేచి చూసే ధోరణికి శివసేన ముగింపు పలుకుతుందని సంజయ్ రౌత్ అన్నారు. అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత బీజేపీ బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు. శివసేనకు మద్దతివ్వాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఆ పార్టీ ఎంపీ హుస్సేన్ దల్వాయ్ లేఖ రాయడం సంతోషించదగ్గ అంశమని చెప్పారు. అయితే, కూటమిగా బీజేపీతో కలిసి పని చేశామని... అందుకు కూటమి ధర్మాన్ని పాటిస్తామని తెలిపారు.

More Telugu News