KCR: కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని దివాళా రాష్ట్రంగా మార్చారు: బీజేపీ నేత కృష్ణసాగర్ రావు

  • సీఎం కేసీఆర్ కు ధనదాహం, పదవీ వ్యామోహం పెరిగాయి 
  • రాష్ట్రంలో సాగుతున్నది నియంత పాలన
  • ఆర్థిక పరిస్థితులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం

కేసీఆర్ తన ఫాసిస్టు నిర్ణయాలతో ధనిక రాష్ట్రమైన తెలంగాణను దివాళా రాష్ట్రంగా   మార్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని భావించబట్టే వారికి బీజేపీ మద్దతు ఇస్తోందని తెలిపారు. ఈ రోజు కృష్ణసాగర్ రావు హన్మకొండ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

సీఎం కేసీఆర్ కు ధనదాహం, పదవీ వ్యామోహం పెరిగాయని విమర్శించారు. కేసీఆర్ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిందని, సంక్షేమ పథకాలకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించకుండా కేసీఆర్ నియంతను తలపిస్తున్నారన్నారు. 50 వేలమంది ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా వారిని రోడ్డున పడేశారని పేర్కొన్నారు. ఆర్టీసీ  ఆడిట్ పై వివరణ కోరే అధికారం గవర్నర్ కు ఉంటుందని, త్వరలో గవర్నర్ ను కలిసి ఆర్టీసీ ఆర్థికపరిస్థితిపై వివరణ కోరతామన్నారు. అదేవిధంగా  రాష్ట్ర పరిస్థితులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని కృష్ణాసాగర్ రావు చెప్పారు.

More Telugu News