Kapu Ramachandra Reddy: కాపు రామచంద్రారెడ్డి అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారు: కాల్వ శ్రీనివాసులు

  • కేసు విచారణలో ఉండగానే క్వారీని మళ్లీ తెరిచారు
  • ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు
  • స్థానికులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు

అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఆరోపణలు గుప్పించారు. నేమకల్లులో అక్రమ మైనింగ్ జరుపుతున్నారని... అనుమతులు లేకుండానే క్వారీలో పేలుళ్లు జరిపారని అన్నారు. పేలుళ్లు జరిపిన వారిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని... అయినా, పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని చెప్పారు. అక్రమ పేలుళ్లకు పాల్పడిన వారిని వదిలేసి... వారిని పట్టించిన వారిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. స్థానికులపై బళ్లారిలో ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేమకల్లు ప్రజలను పోలీసులు అనేక విధాలుగా వేధిస్తున్నారని... దీంతో, భయంతో ప్రజలు నేమకల్లును వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. జరుగుతున్న అరాచకాలపై జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.

జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు 14 నెలల క్రితం క్వారీని ప్రభుత్వం మూత వేయించిందని కాల్వ చెప్పారు. కేసు విచారణలో ఉండగానే కాపు రామచంద్రారెడ్డి క్వారీని మళ్లీ తెరిచారని, ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతూ, కంకరను కర్ణాటకకు తరలిస్తున్నారని విమర్శించారు.

More Telugu News