Priyanka: బీజేపీకి స్వాతంత్ర్య పోరాట చిహ్నంగా నిలిచే దిగ్గజ నేతలు లేరు: ప్రియాంక గాంధీ

  • అందుకే ఆ పార్టీకి కాంగ్రెస్ దిగ్గజాలను గౌరవించాల్సి వస్తోందన్న ప్రియాంక
  • సర్దార్ పటేల్ ఎంతో నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నేత అంటూ వ్యాఖ్యలు
  • పటేల్ ను ప్రత్యర్థులు గౌరవించడం ఆనందాన్నిస్తోందని వెల్లడి

 బీజేపీకి స్వాతంత్ర్య పోరాట చిహ్నంగా నిలిచే దిగ్గజ నేతలెవరూ లేక స్వాతంత్ర్య పోరాటం చేసిన కాంగ్రెస్ దిగ్గజాలను గౌరవించాల్సి వస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. భారత మాజీ ఉప ప్రధాని ‘ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్’ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీ ఆయనకు నివాళులర్పించడంపై ప్రియాంక స్పందించారు.

అయితే, బీజేపీ వైఖరిని ఎండగడుతూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘సర్దార్ పటేల్ ఎంతో నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నేత. పార్టీ సిద్ధాంతాను ఆయన విశ్వసించారు. జవహర్ లాల్ నెహ్రూకు సన్నిహితుడు. ఆరెస్సెస్ కు వ్యతిరేకంగా ఉండేవారు’ అని ట్వీట్ చేశారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పటేల్ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసి... పటేల్ ప్రత్యర్థులు కూడా ఆయన్ను గౌరవించాల్సి రావడం తనకెంతో ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.

కాగా, మోదీ సర్కార్ సర్దార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దివస్ గా ప్రకటించింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని ఐక్యతా విగ్రహం వద్ద పటేల్ కు నివాళులర్పించి ప్రసంగించారు. జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దును పటేల్ కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.  

More Telugu News