Narendra Modi: పొరుగు దేశాలు మన ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి యత్నిస్తున్నాయి: మోదీ

  • వల్లభాయ్ పటేల్ వంటి మహనీయుల మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి
  • పొరుగు దేశాల కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలి
  • ఆర్టికల్ 370 రద్దు చేయడం మంచి పరిణామం

పొరుగు దేశాలు మన ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి యత్నిస్తున్నాయని, ఇలాంటి సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయుల మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. వారి ఆదర్శాల మేరకు పొరుగు దేశాల కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలో ‘ఐక్యతా విగ్రహాన్ని’ సందర్శించి ఆయన నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఏక్ తా దివస్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... 'ఆర్టికల్ 370 రద్దు చేయడం జమ్మూ కశ్మీర్ యువతను మంచి మార్గంలోకి నడిపిస్తుంది. ఈ పరిణామం వల్లభాయ్ పటేల్ కు మేము అందించిన నివాళి. ఆగస్టు 5న సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం. ఐక్యతకు కృషి చేసిన వల్లభాయ్ పటేల్ జయంతి సాక్షిగా జమ్మూ కశ్మీర్ లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాం. ఐక్యత అనేది దేశ సంప్రదాయం, సంస్కృతి' అని వ్యాఖ్యానించారు.

'ఈ రోజు దేశమంతటా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. దేశ ఐక్యత కోసం ఆయన ఆదర్శాలను మనం పాటించాలి. దేశానికి ప్రతికూలంగా నిలుస్తోన్న శక్తులను నిరోధించడానికి పటేల్ ఆశీర్వాదాలతో కొన్ని రోజుల క్రితం దేశం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. జమ్మూ కశ్మీర్ లో మూడు దశాబ్దాల్లో ఉగ్రవాదుల చేతుల్లో 40,000 మంది ప్రాణాలు కోల్పోయారు' అని మోదీ అన్నారు.

More Telugu News