BJP: బీజేపీ తీరు ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది: కశ్మీర్ లో ఈయూ ప్రతినిధుల పర్యటనపై శివసేన విమర్శలు

  • విదేశీ ప్రతినిధులను ఆ ప్రాంతానికి ఎందుకు పంపారు?
  • కశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కాదా?
  • హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి

జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ సమాఖ్య (ఈయూ) ఎంపీల పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. 'ఈయూకి చెందిన ఎంపీలు కశ్మీర్ లోని పరిస్థితులను తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. దేశంలో కశ్మీర్ అంతర్భాగం. ఆ ప్రాంతంలో జాతీయ జెండా ఎగిరింది.. ఇందుకోసం ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా చేసిన కృషి పట్ల గర్విస్తున్నాం. అయితే, కశ్మీర్ లో పరిస్థితులన్నీ సరిగ్గానే ఉంటే విదేశీ ప్రతినిధులను ఆ ప్రాంతానికి ఎందుకు పంపారు? కశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కాదా?' అని శివసేన తమ పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది.

'ఆ ప్రాంతం విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ, కశ్మీర్ కు విదేశీ ప్రతినిధులను పంపుతోంది. ఇలా విదేశీయులు కశ్మీర్ లో పరిస్థితులను గుర్తించడానికి వస్తే దేశంలోని స్వేచ్ఛపై దాడి చేసినట్లే. ఈ చర్య ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. భారత ఎంపీలు ఆ ప్రాంతంలో పర్యటించడానికి అనుమతి ఇవ్వని కేంద్ర ప్రభుత్వం.. విదేశీ ప్రతినిధులను మాత్రం ఎందుకు స్వాగతించింది? ఈ ప్రశ్నకు హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి. వారిని ఈ పర్యటనకు అనుమతించి ప్రతిపక్షాలు దీనిపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశాన్ని బీజేపీయే ఇచ్చింది' అని విమర్శలు గుప్పించింది. 

More Telugu News