Hyderabad: పోలీస్‌ కమిషనర్‌ కావాలన్న ఆమె కోరిక అలా తీరింది!

  • 17 ఏళ్లకే బాధ్యతలు స్వీకరించిన రమ్య
  • క్యాన్సర్‌తో పోరాడుతున్న ఇంటర్‌ విద్యార్థిని
  • మేక్‌ ఏ విష్‌ సంస్థ సహకారంతో అవకాశం

జీవితాన్ని గెలవాలనీ, అత్యున్నత స్థాయికి ఎదగాలని కలలు గంటూ ఆశల సౌధాన్ని నిర్మించుకుంది ఆ బాలిక. కానీ విధి చిత్రం ఆమె ఆశలకు బ్రేక్‌ వేసింది. పదిహేడేళ్ల  ప్రాయంలోనే ప్రాణాంతక బ్లడ్‌క్యాన్సర్‌ బారిన పడి పోరాడుతోంది. దీంతో ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలన్న ఆమె కోరిక నెరవేరుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో ‘మేక్‌ ఏ విష్‌‘ సంస్థ సహకారంతో ఒకరోజు కమిషనర్‌గా అవకాశం ఇచ్చి పోలీసు అధికారులు బాధితురాలి కోరిక తీర్చారు.

 వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌లోని ఆల్వాల్‌కు చెందిన నర్సింహ, పద్మ దంపతుల కుమార్తె రమ్య. ఇంటర్‌ చదువుతున్న రమ్య లుకేమియా (బ్లడ్‌క్యాన్సర్‌) బారిన పడినట్టు గుర్తించడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు.

బాల్యం నుంచి చదువులో రాణించే రమ్య తాను ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలని కలలుకంది. ఆమె ఆశ తీరుతుందో లేదో అన్న ఆందోళన నేపథ్యంలో మేక్‌ ఏ విష్‌ సంస్థ ఆమె కోరిక కాస్తయినా తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ను కలిసి ఒకరోజు కమిషనర్‌గా చేయాలన్న రమ్య కోరిక తెలియ జేయడంతో ఆయన సరే అన్నారు.

దీంతో నిన్న రమ్య యూనిఫాం ధరించి తన తల్లిదండ్రులతో కలిసి కమిషనరేట్‌కు రాగా, మహేష్‌ భగవత్‌ సాదరంగా ఆహ్వానించి తన సీట్లో కూర్చోబెట్టారు. కమిషనర్‌ విధులను ఆమెకు వివరించారు. ‘రమ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ ఈ సందర్భంగా కమిషనర్‌ ఆమెకు కొంత నగదు సాయం అందజేశారు.

More Telugu News