TTD: టీటీడీ వినూత్న నిర్ణయం... నేడు ఐదేళ్లలోపు బిడ్డలున్న వారికి స్పెషల్ దర్శనం!

  • ఇటీవల సమావేశమైన బోర్డు
  • వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం
  • కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ

తిరుమలలో చంటిబిడ్డలున్న తల్లిదండ్రులకు కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రత్యేక దర్శనాన్ని కల్పిస్తారన్న సంగతి తెలిసిందే. నేడు మాత్రం, ఏడాది వయసుకు బదులుగా, ఐదేళ్లలోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు స్పెషల్ దర్శనం లభించనుంది. ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు, నేడు ప్రత్యేక దర్శనానికి భక్తులను అనుమతించనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఏ విధమైన క్యూలైన్లలో వేచి చూడకుండా ఐదేళ్లలోపున్న తమ పిల్లలతో సహా తల్లిదండ్రులు స్వామిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.

కాగా, ఈ ఉదయం తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. స్వామి దర్శనానికి వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్టుమెంట్లు నిండివున్నాయి. దర్శనానికి 12 నుంచి 14 గంటల వరకూ సమయం పడుతుందని, క్యూలైన్లలో వేచివున్న వారికి అన్నపానీయాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. నిన్న స్వామిని 75 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.

More Telugu News