KCR: అది ఉత్తుత్తి హామీనా? కోర్టుకు అబద్ధం చెప్పారా?: కేసీఆర్ ను నిలదీసిన విజయశాంతి

  • కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ అమలు కాదు
  • హైకోర్టులో ప్రభుత్వ వాదన చూస్తేనే తెలుస్తోంది
  • ప్రభుత్వం వేసిన గుగ్లీతో దొరికిపోయిన కేసీఆర్
  • ఫేస్ బుక్ లో విజయశాంతి విమర్శలు

"ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో టిఆర్ఎస్ ప్రభుత్వ తరపు న్యాయవాది చేసిన వాదనను చూస్తుంటే, రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ గారిచ్చే ఏ హామీ కూడా అమలు కాదని స్పష్టంగా అర్థం అవుతోంది" అని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. కేసీఆర్ హుజూర్ నగర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఉత్తుత్తివా? లేక కోర్టుకు అవాస్తవాలు చెప్పారా? అని ఆమె ప్రశ్నించారు.

"తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేవని ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొనడం ఇందుకు నిదర్శనం. హైకోర్టు ఈ వివరణకు కౌంటర్ ప్రశ్న వేస్తూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చడానికి 47 కోట్ల రూపాయలు లేనప్పుడు హుజూర్‌ నగర్‌ లో 100 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి పథకాలు అమలుచేస్తానని కెసిఆర్ గారు ఎలా ప్రకటించారని నిలదీసింది.

కోర్టు వేసిన ప్రశ్నతో కెసిఆర్ గారు అడ్డంగా దొరికిపోయారు. కోర్టు వేసిన ప్రశ్నకు సమాధానంగా హుజూర్‌ నగర్‌ లో వంద కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద తగిన నిధులు ఉన్నాయని అంగీకరించడం లేదా కేవలం ఉత్తుత్తి హామీలు ఇచ్చానని చేతులెత్తేయడం ఈ రెండిటిలో ఏదో ఒకటి చేయాలి. ఒకవేళ హుజూర్‌ నగర్ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తే అప్పుడు ఆర్టీసీ కార్మికులకు కూడా 47 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది" అని అన్నారు.

"ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు, సీఎం దొరగారు తన పంతాన్ని నెగ్గించుకునేందుకు వంద కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇవ్వకుండా హుజూర్‌నగర్ ఓటర్లకు మొండిచేయి చూపిస్తారని అర్థమవుతోంది. ఇప్పటి వరకు తాను అపర చాణుక్యుడనని కెసిఆర్ గారు ఫీలవుతూ ఉంటారు. ఇప్పుడు కోర్టు వేసిన గూగ్లితో ఆయన బండారం బయటపడింది" అని మండిపడ్డారు.

More Telugu News