Hyderabad: మోసం చేశాడంటూ ట్రైనీ ఐపీఎస్ పై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు

  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు 
  • కేసు నమోదు చేసిన జవహర్ నగర్ పోలీసులు
  • ఐపీఎస్ కు ఎంపికైన తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నభార్య

ప్రేమించి పెళ్లిచేసుకుని  దూరంగా ఉంచాడంటూ  ఓ యువతి శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారిపై ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాద్ జవహర్ నగర్ లో చోటుచేసుకుంది. పెళ్లైన 18 నెలల తర్వాత భర్త తనను దూరం పెడుతున్నట్లు బాధితురాలు భావన ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న జవహర్ నగర్ పోలీస్ లు సదరు ట్రైనీ ఐపీఎస్ అదికారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మూడు నెలల క్రితం కూడా భావన ఇదేరీతిలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరినీ (వెంకటమహేశ్వర్ రెడ్డి, భావన) పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు.

  రైల్వేలో ఉద్యోగం చేస్తున్న బాధితురాలు మళ్లీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు వివరాలను మీడియాకు తెలిపారు. తొమ్మిదేళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్న సమయంలో కడపకు చెందిన వెంకటమహేశ్వర్ రెడ్డితో భావనకు పరిచయమైందని, అనంతరం అది ప్రేమగా మారిందని తెలిపారు. 2018 ఫిబ్రవరిలో తాము వివాహం చేసుకున్నామని బాధితురాలు చెప్పిందన్నారు. అనంతరం వెంకటమహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ కు ఎంపికయ్యాడని, తన తల్లిదండ్రులను ఒప్పిస్తానని చెప్పడంతో వారిద్దరు కలిసే ఉంటున్నారన్నారు.

ఆ తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ఎక్కువ కట్నం ఇచ్చి తనకు పిల్లనివ్వడానికి వస్తున్నారని, అడ్డొస్తే ఊరుకోననీ బెదిరించాడని ఆమె ఫిర్యాదు చేసిందని తెలిపారు. తనకు రాజకీయ నాయకులతో పరిచయం ఉందని చెబుతూ, అతను తనను శారీరకంగా, మానసికంగా వేధించినట్లు భావన తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. మహేశ్వర రెడ్డి ముస్సోరిలో ఐపీఎస్ శిక్షణలో ఉండటంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

More Telugu News