Delhi: వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీ మ్యాచ్ పై నీలినీడలు.. కేజ్రీవాల్ స్పందన

  • వచ్చే నెల 3న ఢిల్లీలో తొలి టీ20
  • గాలి నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్న కేజ్రీవాల్
  • కాలుష్యం అదుపులోకి వస్తుందంటూ వ్యాఖ్య

ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య వచ్చే నెల 3న ఢిల్లీలో తొలి టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, విపరీతమైన వాయు కాలుష్యం కారణంగా ఈ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా వాతావణ కాలుష్య స్థాయులు భారీగా పెరిగి, గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.

ఢిల్లీలో తొలి టీ20 జరగాలని కేజ్రీవాల్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. గాలి నాణ్యతను పెంచేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుందని చెప్పారు. క్రికెట్ మ్యాచ్ లకు వాయు కాలుష్యం అడ్డుకాకూడదని అన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే అనేక మ్యాచ్ లు జరిగాయని చెప్పారు. మ్యాచ్ కు ఇంకా ఐదు రోజుల సమయం ఉన్నందున... కాలుష్యం అదుపులోకి వస్తుందని తెలిపారు. మరోవైపు, బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారం ఢిల్లీలో మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పారు.

More Telugu News