Supreme Court: సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా ఎస్ఏ బాబ్డేను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు!

  • నవంబర్ 17న రిటైర్ అవుతున్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
  • నవంబర్ 18న జస్టిస్ బాబ్డే ప్రమాణస్వీకారం
  • 18 నెలల పాటు చీఫ్ జస్టిగా వ్యవహరించనున్న బాబ్డే

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 18న చీఫ్ జస్టిస్ గా జస్టిస్ బాబ్డే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీకాలం నవంబర్ 17న ముగియనుంది.

1956 ఏప్రిల్ 24న మహారాష్ట్ర నాగపూర్ లో జస్టిస్ బాబ్డే జన్మించారు. నాగపూర్ యూనివర్శిటీలో ఆయన విద్యనభ్యసించారు. 2000వ సంవత్సరంలో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవీ బాధ్యతలను చేపట్టారు. 2013 ఏప్రిల్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చారు. అయోధ్య స్థల వివాదం కేసు, బీసీసీఐ కేసు వంటి కీలక కేసులను విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 18 నెలల పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిగా ఎస్ఏ బాబ్డే వ్యవహరించనున్నారు.

మరోవైపు, పదవీ విరమణకు నెల రోజుల ముందు తదుపరి చీఫ్ జస్టిస్ పేరును ప్రస్తుత చీఫ్ జస్టిస్ ప్రతిపాదించడం ఒక ఆనవాయతీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎస్ఏ బాబ్డే పేరును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదన తొలుత న్యాయశాఖ మంత్రికి, అక్కడి నుంచి ప్రధానమంత్రికి, అక్కడి నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. అనంతరం జస్టిస్ బాబ్డేను తదుపరి చీఫ్ జస్టిస్ గా నియమిస్తూ రాష్ట్రపతి కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News