Jammu And Kashmir: యూరప్ ఎంపీలకు అజిత్ దోవల్ విందు.. ముగ్గురు జమ్మూకశ్మీర్ నేతలకు ఆహ్వానం

  • యూరోపియన్ యూనియన్ కు చెందిన 27 మంది ఎంపీల పర్యటన
  • ఆర్టికల్ 370 తర్వాత జేకేలో పర్యటిస్తున్న తొలి అంతర్జాతీయ బృందం ఇదే
  • ఇప్పటికే భారత్ చర్యలకు మద్దతు పలికిన ఈయూ పార్లమెంట్

జమ్మూకశ్మీర్ లో నేడు యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన 27 మంది ఎంపీలు పర్యటిస్తున్నారు. పర్యటన సందర్భంగా జమ్మూకశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులను వారు పరిశీలించనున్నారు. పాకిస్థాన్ ఆరోపిస్తున్నట్టుగా అక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందా? అనే విషయాన్ని అధ్యయనం చేస్తారు.

మరోవైపు, ఈయూ ఎంపీలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు జమ్మూకశ్మీర్ కు చెందిన ముగ్గురు సీనియర్ రాజకీయ నేతలకు కూడా ఆహ్వానం అందింది. వీరిలో పీడీపీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం ముజఫర్ బేగ్, గతంలో పీడీపీతో కలిసి పని చేసిన అల్తాఫ్ బుఖారీ, కాంగ్రెస్ నేత ఉస్మాన్ మజీద్ ఉన్నారు.

జమ్మూకశ్మీర్ లో మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలతో పాటు దాదాపు 250 మంది రాజకీయ నాయకులు నిర్బంధంలో ఉన్నారు. ఈరోజు అజిత్ దోవల్ విందుకు హాజరవుతున్న ముగ్గురు నేతలు నిర్బంధ జాబితాలో లేరు. కశ్మీర్ లోయలో పాత నేతలను పక్కన పెట్టి సరికొత్త నాయకులను తెరపైకి తెచ్చేందుకే వీరిని విందుకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తున్న తొలి అంతర్జాతీయ బృందం ఇదే కావడం గమనార్హం. ఇప్పటికే యూరోపియన్ పార్లమెంటు భారత్ కు తన మద్దతును ప్రకటించింది. గత నెలలో జమ్మూకశ్మీర్ అంశంపై యూరోపియన్ పార్లమెంటు చర్చించింది. ఈ సందర్భంగా కశ్మీర్ లోయలో వీలైనంత త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించింది.

More Telugu News