Donald Trump: అల్ బాగ్దాదీని తరిమిన శునకరాజం ఇదిగో... ఫొటో విడుదల చేసిన అమెరికా!

  • కుక్కచావు చచ్చిన అల్ బాగ్దాదీ
  • శునకం పేరును మాత్రం వెల్లడించలేను
  • ట్విట్టర్ లో పేర్కొన్న డొనాల్డ్ ట్రంప్

ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ కుక్క చావు చచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోని దినపత్రికల్లో ప్రధాన వార్త ఇదే. బాగ్దాదీ చివరి ఘడియల్లో అతన్ని తమ శునకం తరిమిందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. శునకం తనను తరుముతోందని, కాసేపట్లో తాను యూఎస్ సైన్యానికి చిక్కక తప్పదని అర్థమైన నేపథ్యంలో బాగ్దాదీ, తనను తాను పేల్చేసుకున్నాడు.

అదే పేలుడులో యూఎస్ శునకానికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఆ వెంటనే యూఎస్ సైన్యం దాని ప్రాణాలు కాపాడాలన్న లక్ష్యంతో ఆసుపత్రికి తరలించింది. ఈ విషయాన్ని ట్రంప్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, శునకం ఫొటోను విడుదల చేశారు.

"ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీని హతమార్చడంలో కీలకమైన పాత్రను పోషించిన అద్భుతమైన శునం చిత్రమిది. దీని పేరును మాత్రం వెల్లడించలేము" అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ శునకం అద్భుతమైన సేవలందించిందని యూఎస్ సంయుక్త సైన్యాధిపతి జనరల్ మార్క్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ శునకం కోలుకుందని, దీని వివరాలను మాత్రం వెల్లడించలేమని అన్నారు.

కాగా, ఇది బెల్జియం జాతికి చెందిన మాలినోయిస్ జాగిలం. 2011లో ఇదే జాతికి చెందిన కైరో అనే పేరు గల శునకం, అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చడంలో అమెరికా సైన్యానికి తన సేవలను అందించింది.

More Telugu News