Rains: కమ్మేసిన మేఘాలు... తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం!

  • బంగాళాఖాతంలో, అరేబియా సముద్రంలో అల్పపీడనాలు
  • దక్షిణ భారతావనిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
  • మారిపోయిన వాతావరణం

ఓ వైపు బంగాళాఖాతంలో వాయుగుండం, మరోవైపు అరేబియా సముద్రంలో తుపాను నేపథ్యంలో దక్షిణ భారతావనిలో మేఘాలు కమ్ముకున్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

దట్టమైన మేఘాలు కమ్మేశాయి. దక్షిణ భారతావనికి చుట్టూ అల్పపీడనాలు ఉండటానికి తోడు, ఉపరితల ఆవర్తనం తోడు కావడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని, చాలా ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ లో గత రాత్రి నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎల్బీనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

గడచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసింది. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షాలు మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు.

కాగా, బంగాళాఖాతంలోని వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ అధికారులు తుపాను గమనాన్ని అనుక్షణం గమనిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ తుపాను ఎప్పుడు, ఎక్కడ తీరాన్ని దాటుతుందో వెల్లడించే అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు.

More Telugu News