Share Chat: షేర్ చాట్ లో పరిచయమైన అమ్మాయి కోసం... అనంతపురం టూ విజయవాడ... అడ్డంగా బుక్కయ్యాడు!

  • డిగ్రీ చదువుతున్నానని చెప్పి పరిచయం పెంచుకున్న అమ్మాయి
  • తనను తీసుకెళ్లకుంటే చనిపోతానని మెసేజ్
  • మైనర్ అని తెలియక వచ్చానంటున్న యువకుడు

తనకు షేర్ చాట్ లో పరిచయమైన అమ్మాయి కోసం ఆశగా, అనంతపురం నుంచి విజయవాడకు వచ్చిన ఓ అబ్బాయి, వారి కుటుంబీకులకు దొరికిపోయాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన ఎం విజయ్ కుమార్ అనే యువకుడికి, రెండు వారాల క్రితం సోషల్ మీడియాలో ఉండవల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక (15) పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరూ చాటింగ్ చేసుకునే వారు.

ఈ క్రమంలో ఆ బాలిక, యువకుడితో మాట్లాడుతూ, తనను ఇంట్లో నుంచి తీసుకుని వెళ్లకుంటే చనిపోతానని చెప్పింది. దీంతో విజయ్ కుమార్ తన సోదరుడు నవీన్ తో కలిసి నిన్న విజయవాడకు వచ్చారు. ఓ హోటల్ లో దిగారు. ఈ విషయాన్ని బాలికకు చెప్పారు. ఈలోగా విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు, హోటల్ కు వెళ్లి యువకులను పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.

కాగా, తాను ఆ అమ్మాయి మైనర్ అనుకోలేదని, డిగ్రీ చదివినట్టు తాను చెప్పిందని, అందువల్లే వచ్చానని విజయ్ పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. మొత్తం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News