shiv sena: మహారాష్ట్ర గవర్నర్ తో వేర్వేరుగా బీజేపీ, శివసేన నేతల సమావేశం!

  • మహారాష్ట్రలో కొలిక్కి రాని ప్రభుత్వ ఏర్పాటు చర్యలు
  • మర్యాదపూర్వకంగానే కలిశామంటోన్న శివసేన 
  • సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ శివసేన డిమాండ్

మహారాష్ట్రలో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ డిమాండ్ పెట్టిన శివసేన.. ఇంకా తన పట్టు వీడడం లేదు. వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన కోరుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం శివసేన నేత ఒకరు... గవర్నర్ భగత్‌సింగ్‌ కోష్యారితో సమావేశం అయ్యారు. మరోవైపు బీజేపీ కూడా గవర్నర్ ను కలవనుంది.

శివసేన నేత దివాకర్‌ రౌత్‌.. తమ పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ తరపున గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపామని చెప్పుకొచ్చారు. తమ మధ్య రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. కాసేపట్లో బీజేపీ నేతలు కూడా గవర్నర్‌తో సమావేశం అవుతారని తెలుస్తోంది. మర్యాద పూర్వకంగా గవర్నర్ ను కలుస్తున్నట్లు ఇరు పార్టీలూ చెప్పుకోవడం గమనార్హం.

ఐదేళ్ల క్రితం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈ సారి తమ పార్టీకి సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే విషయంలో రిమోట్ కంట్రోల్ శివసేన చేతిలోనే ఉందని ఆ పార్టీ నిన్న పేర్కొన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ దక్కని నేపథ్యంలో బీజేపీకి శివసేన మద్దతు తప్పనిసరి అయింది. దీంతో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను శివసేన తీసుకొచ్చింది.

More Telugu News