Goodwin Jewellery: నిండా ముంచేసిన 'గుడ్ విన్' జ్యూయెలరీ... నిందితులంతా పరారీలో!

  • గోల్డ్ స్కీమ్ లను చూపి ఆకర్షించిన యజమానులు
  • నమ్మి లక్షల్లో డబ్బు కట్టిన వేలాది మంది
  • అక్టోబర్ 21 నుంచి కనిపించకుండా పోయిన యాజమాన్యం

ఆకర్షణీయమైన గోల్డ్ స్కీమ్ ను ప్రజలకు ఆశగా చూపిన గుడ్ విన్ జ్యూయెలరీ సంస్థ, తమను నమ్మిన వారిని నట్టేట ముంచేస్తూ, బోర్డు తిప్పేసింది. ఆఫర్ల ఆశచూపించి, పెద్దమొత్తంలో డబ్బులు కట్టించుకున్న సంస్థ యజమానులు ఇప్పుడు పరారీలో ఉండగా, ముంబై పోలీసులు కేసు నమోదు చేసి, వారు ఎక్కడున్నారో తేల్చే పనిలో పడ్డారు.

వివరాల్లోకి వెళితే, ముంబైకి చెందిన గుడ్ విన్ గ్రూప్, ఓ జ్యూయెలరీ షాప్ ను నిర్వహిస్తోంది. సంస్థ చైర్మన్ సునీల్ కుమార్, ఎండీ సుధీర్ కుమార్ లు బంగారు ఆభరణాలపై పలు ఆఫర్లను ప్రచారం చేశారు. వారిని నమ్మిన వేలాది మంది లక్షల రూపాయలు పెట్టుబడులుగా పెట్టారు.

అక్టోబర్ 21 నుంచి యజమానులు ఇద్దరూ కనిపించలేదు. షాపులను మూసివేశారు. వారి కుటుంబీకులు కూడా కనిపించడం లేదని గమనించిన 50 మందికి పైగా బాధితులు, రామ్ నగర్ పోలీసు స్టేషన్ ఎదుట నిరసనకు దిగడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు జ్యూయెలరీ షాపులను సీజ్ చేశారు.

 ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారి పాస్ పోర్టు వివరాలను సేకరిస్తున్నామని, లుక్ అవుట్ నోటీసుల జారీకి అవకాశాలు ఉన్నాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వారి కోసం రైల్వే పోలీసులను, కంట్రోల్ రూమ్ ను, విమానాశ్రయం అధికారులను అప్రమత్తం చేశామని వెల్లడించారు.

More Telugu News