దీపావళి నాడు... గత ఏడాదితో పోలిస్తే తగ్గిన వాయు కాలుష్యం!

28-10-2019 Mon 08:15
  • గత సంవత్సరం ఏక్యూఐ 600 పాయింట్లు
  • ఈ సంవత్సరం సగటున 350
  • ఢిల్లీలో గణనీయంగా తగ్గిన వాయు కాలుష్యం
దీపావళి పండగ వేళ, గాల్లో ఎంతో కాలుష్యం కలుస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా నిన్న పండగ పూట ప్రజలు కాల్చిన టపాసులతో తీవ్రమైన వాయు కాలుష్యం నెలకొంది. అయితే, ఇది గత సంవత్సరం కన్నా తక్కువే కావడం గమనార్హం.

గత సంవత్సరం పండగ నాడు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 600 మార్క్ ను దాటగా, ఈ సంవత్సరం సగటున 350గా నమోదైంది. నిన్న మధ్యాహ్నం ఏక్యూఐ స్థాయి 341గా ఉండగా, ఆపై రాత్రికి 390 వరకూ వెళ్లింది. ఢిల్లీలో 37 ఏక్యూఐ స్టేషన్లుండగా, 29 స్టేషన్లలో సగటు కన్నా అధిక కాలుష్యం నమోదైంది. ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న ఫరీదాబాద్ లో 318, గజియాబాద్ లో 397, నోయిడాలో 357, గ్రేటర్ నోయిడాలో 315గా ఏక్యూఐ నమోదైంది. ప్రజల్లో దీపావళి నాడు టపాసులు పేల్చడంపై అవగాహన కల్పించడం, గ్రీన్ టపాసుల ప్రమోషన్ తదితర కారణాలతో కాలుష్య కారకాలు తగ్గాయని అధికారులు వ్యాఖ్యానించారు.