Duplesis: చీకట్లో బంతులేసి వికెట్లు తీశారన్న డుప్లెసిస్... నెటిజన్ల విమర్శలు

  • భారత్ పై 3 టెస్టుల్లోనూ సఫారీల ఓటమి
  • టాస్ ఓటమి ప్రతికూలంగా మారిందన్న డుప్లెసిస్
  • డుప్లెసిస్ వ్యాఖ్యలు క్రీడాస్ఫూర్తికి విఘాతమన్న అభిమానులు

ఇటీవల భారత పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు ఘోర పరాజయాలు మూటగట్టుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. 3 టెస్టుల సిరీస్ లో సఫారీలను చిత్తుగా ఓడించిన టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. దీనిపై దక్షిణాఫ్రికా సారథి ఫాఫ్ డుప్లెసిస్ సరికొత్త వాదన వినిపిస్తున్నాడు. భారత్ తో ఆడిన ప్రతి టెస్టులోనూ తాము మొదటి ఇన్నింగ్స్ ను వెలుతురు లేని పరిస్థితుల్లో ఆరంభించాల్సి వచ్చిందని, ఆ చీకట్లో ఆడి టాపార్డర్ వికెట్లు చేజార్చుకున్నామని వివరించాడు.

టీమిండియా ఓ 500 పరుగులు చేసి చీకటి వేళకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేదని, అనంతరం ఆ చీకట్లో తమవి మూడు వికెట్లు పడగొట్టి ఒత్తిడి పెంచేదని డుప్లెసిస్ వాపోయాడు. ప్రతి టెస్టులోనూ ఇదే తంతు కనిపించిందని తెలిపాడు. టాస్ ఓడిపోవడం తమకు ప్రతికూలంగా మారిందన్నాడు.

అయితే డుప్లెసిస్ వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు క్రీడాస్ఫూర్తికి విఘాతం అని, ఓటమికి కుంటిసాకులు వెతక్కుండా గెలవడానికి ప్రయత్నాంచాలని హితవు పలికారు. ఓ సీనియర్ ఆటగాడై ఉండి డుప్లెసిస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా గౌరవం పోగొట్టుకుంటున్నాడని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

More Telugu News