PVP: మాపై ఒక్క చెక్ బౌన్స్ కేసు లేదు కానీ, బండ్ల గణేశ్ పై 58 చెక్ బౌన్స్ కేసులున్నాయి: పీవీపీ

  • ఇంకా ఏడు కోట్లు ఇవ్వాలి 
  • ఐదేళ్లయినా బాకీ చెల్లించలేదని ఆరోపణ 
  • బొత్సతో తనకు సంబంధం లేదన్న పీవీపీ

ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని నిర్మాత పీవీపీ ఫిర్యాదు చేయడంతో నిర్మాత బండ్ల గణేశ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ’టెంపర్’ సినిమా తీయడానికి చేసిన ఖర్చు నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేశ్ మధ్య కుంపటి రాజేసింది. ఈ నేపథ్యంలో తాను ఫైనాన్స్ చేసిన డబ్బులు పూర్తిగా ఇవ్వలేదంటూ పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై ఈ రోజు పీవీపీ మీడియాతో మాట్లాడారు.
 
‘ఈ సినిమాకోసం రూ.30 కోట్లు ఫైనాన్స్ చేస్తే అందులో రూ.23 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారు. మిగతా రూ.7 కోట్లకు బ్లాంక్ చెక్కులు ఇచ్చారు కానీ, వాటి వల్ల ప్రయోజనం లేకపోయింది. ఐదేళ్లు గడిచినా డబ్బులు తిరిగి రాలేదు. దీంతో మేము గణేశ్ పై లీగల్ చర్యలు చేపట్టాలనుకున్నాం, అదే చేశాం’ అని పీవీపీ అన్నారు.

అంతకు ముందు గణేశ్ చర్చలకోసం మనుషులను పంపిస్తూ.. బంజారాహిల్స్ కేసులో మాపై కేసు నమోదు చేయించాడు. ఈ సందర్భంగా ఒక్క విషయం తెలుసుకోవాలి. మాపై ఒక్క చెక్ బౌన్స్ కేసు లేదు కానీ ఆయనపై 58 చెక్ బౌన్స్ కేసులున్నాయి' అని పీవీపీ  పేర్కొన్నారు.

వైసీపీ నేత బొత్స సత్యనారాయణతో గణేశ్ సంబంధాలపై పీవీపీ మాట్లాడుతూ ‘బొత్సకు బినామీ గణేశ్ అనే విషయం తెలియదు. దీనిపై వ్యాఖ్యానించను. ఈ వివాదంలో బొత్స నాతో ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి దాంతో నాకు సంబంధం లేదు’ అని తెలిపారు.

More Telugu News