Chandrababu: పండుగ వేళ మేస్త్రీల ఆత్మహత్యలు నన్ను కలచివేశాయి: చంద్రబాబు

  • మేస్త్రీల బలవన్మరణంపై చంద్రబాబు స్పందన
  • తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కార్మికులకు విజ్ఞప్తి
  • తానున్నానని భరోసా

రాష్ట్రంలో ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని దూరం చేయడమే కాకుండా వారి ప్రాణాలను కూడా హరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ వేళ భవన నిర్మాణ రంగ మేస్త్రీలు బ్రహ్మాజీ, వెంకట్రావుల ఆత్మహత్యలు తనను కలచివేశాయని ట్విట్టర్ లో విచారం వ్యక్తం చేశారు. ఇసుక కొరతతో కార్మికులు పనుల్లేక ఆత్మహత్యలు చేసుకుంటుండడం ఎంతో బాధిస్తోందని, వైసీపీ సర్కారు మాత్రం తమ పార్టీ నేతల జేబులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తోందని మండిపడ్డారు.

అయినా, జీవితం ఎంతో విలువైనదని, సమస్యలకు ఎదురొడ్డి పోరాడేలా తప్ప ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని హితవు పలికారు. బ్రహ్మాజీ, వెంకట్రావుల్లా మరెవరూ తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు టీడీపీ అండగా ఉంటుందని, కార్మికుల కోసం తానున్నానని స్పష్టం చేశారు. ఇసుక అక్రమాలపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని నిలదీద్దామంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

More Telugu News