Tamil Nadu: ఆస్తి చేతికొచ్చాక.. తండ్రిని తరిమేసిన కుమార్తె.. కోట్ల ఆస్తిని వెనక్కి ఇప్పించిన అధికారులు!

  • తండ్రి ఆస్తి చేతికి రానంత వరకు జాగ్రత్తగా చూసుకున్న కుమార్తె
  • రూ.3.80 కోట్ల ఆస్తి చేతికి రాగానే తండ్రిని గెంటేసిన వైనం
  • బయటకు వచ్చి కట్టుకున్న ఇల్లును కూడా కూల్చివేయించిన కుమార్తె

తండ్రి ఆస్తి తన చేతికి వచ్చేంత వరకు ఆయనను జాగ్రత్తగా చూసుకున్న కుమార్తె.. కోట్ల ఆస్తి చేతికందగానే తండ్రిని దూరం పెట్టింది. దీంతో ఆమెకు దూరంగా వెళ్లి ఇల్లు కట్టుకుని ఒంటరిగా ఉంటున్నా సహించలేకపోయింది. ఆ ఇంటిని కూడా కూల్చివేయించింది. దీంతో ఆ ముసలి తండ్రి అధికారులను ఆశ్రయించడంతో న్యాయం జరిగింది. కుమార్తె నుంచి మొత్తం ఆస్తిని వెనక్కి ఇప్పించి బాధిత తండ్రికి న్యాయం చేశారు.

తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగలం సమీపంలో జరిగిందీ ఘటన. అధికారుల కథనం ప్రకారం.. కరడిక్కల్ గ్రామానికి చెందిన వైరవన్ (80)కి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారులు ఇద్దరూ ఇప్పటికే మృతి చెందడంతో రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన వైరవన్ కుమార్తె వద్ద ఉంటున్నారు.

కుమార్తె తనను బాగా చూసుకుంటుండడంతో వైరవన్ తన పేరిట ఉన్న రూ.3.80 కోట్ల విలువైన 6.73 ఎకరాల భూమిని ఆమె పేరుపై రాశారు. ఆస్తి చేతికి అందిన తర్వాత కుమార్తె వైఖరిలో మార్పు వచ్చింది. తండ్రిని క్రమంగా దూరం పెట్టింది. దీంతో మనస్తాపం చెందిన వైరవన్ కుమార్తె ఇంటి నుంచి బయటకు వచ్చి తనకున్న కొంత స్థలంలో చిన్న ఇల్లు కట్టుకుని అందులో నివసిస్తున్నారు. ఇది నచ్చని కుమార్తె ఆ ఇంటిని కూల్చివేయించింది. దీంతో నిలువనీడ లేకుండా చేసిన కుమార్తెపై వైరివన్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో స్పందించిన ఆర్డీవో మురుగేశన్ తండ్రీ, కుమార్తెల మధ్య రాజీకుదిర్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చట్టప్రకారం చర్యలు ప్రారంభించారు. కుమార్తె పేరిట ఉన్న ఆస్తిని స్వాధీనం చేసుకుని వైరవన్‌కు అప్పగించారు.

More Telugu News