Sachin Tendulkar: చిన్నప్పుడు తొలిసారి సెలెక్షన్స్ లో నన్ను ఎంపిక చేయలేదు: సచిన్ వెల్లడి

  • ముంబయిలో విద్యార్థులతో సంభాషించిన సచిన్
  • ఎదుగుదలకు షార్ట్ కట్లు ఉండవన్న మాస్టర్
  • కఠోర శ్రమతోనే తాను ఉన్నతస్థానానికి చేరినట్టు వెల్లడి

భారత బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. 11 ఏళ్ల వయసులో క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న తర్వాత తొలిసారి పాల్గొన్న సెలెక్షన్స్ లో నిరాశ తప్పలేదని తెలిపారు. సెలెక్షన్స్ లో పాల్గొన్న తనను తిరస్కరించారని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో భారత జట్టుకు ఆడాలన్న ధ్యేయం ఒక్కటే మనసులో ఉందని, అప్పుడు తాను విద్యార్థి దశలో ఉన్నానని వెల్లడించారు. ఆటను మరింత మెరుగుపర్చుకోవాలని, మరింత హార్డ్ వర్క్ చేయాలని సెలెక్టర్లు సూచించారని వివరించారు.

అయితే సెలెక్షన్స్ లో ఎదురైన అనుభవం తనలో మరింత పట్టుదలను పెంచిందని, ఆటలో మరింతగా శ్రమించాలన్న దృఢసంకల్పం కలిగిందని తెలిపారు. అప్పటినుంచి కఠోరశ్రమతో ఆటపరంగా ఎంతో ఎదిగానని, ఎవరూ షార్ట్ కట్ లతో ఉన్నతస్థానానికి చేరలేరని సచిన్ పేర్కొన్నారు. ముంబయిలోని లేట్ లక్ష్మణ్ రావు దూరే పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులతో సంభాషిస్తూ సచిన్ ఈ విషయాలు తెలిపారు.

More Telugu News