Chittoor District: మెచ్చిన వాడితో పెళ్లి చేయలేదన్న కసితో.. అమ్మానాన్నలను బంధించిన యువతి!

  • తాను ప్రేమించిన వ్యక్తితో కట్టబెట్టాలని డిమాండ్‌
  • మైనర్‌ కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి
  • సర్దిచెప్పిన రెవెన్యూ, పోలీసు అధికారులు

తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోనివ్వడం లేదన్న కోపంతో ఓ యువతి సొంత తల్లిదండ్రులనే ఇంట్లో బంధించింది. తన పెళ్లి చేసే వరకు వారిని విడిచిపెట్టేది లేదని భీష్మించుకుని కూర్చుంది. రెవెన్యూ, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

చిత్తూరు జిల్లా పలమనేరులో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న ఓ బాలిక అదే పట్టణానికి చెందిన యువకుడిని ప్రేమించింది. వారి పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఏడాది క్రితం సదరు బాలిక ఆ యువకుడితో వెళ్లిపోవడంతో అతనిపై ఆమె తల్లిదండ్రులు పోలీసు కేసు పెట్టారు. దీంతో తమది నిజమైన ప్రేమని, పెళ్లికి సహకరించాలని ఆ యువకుడు పలువురిని కోరినా, బాలిక మైనర్‌ కావడంతో ఎవరూ సాయం చేయలేదు.

దీంతో ఆ బాలికను ఇంటికి పంపించేశాడు. ఇంటికి వచ్చిన కుమార్తెను తల్లిదండ్రులు కట్టడి చేయడం మొదలు పెట్టారు. చదువు కూడా మాన్పించేశారు. తాము బయటకు వెళ్లేటప్పుడు బాలికను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లేవారు. మొబైల్‌ కూడా ఇవ్వలేదు. ఈ చర్యలతో అసహనానికి గురైన బాలిక నిన్న తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా బయట నుంచి తలుపునకు తాళం వేసి వరండాలో కూర్చుంది.

తన ప్రియుడిని పిలిపించాలని గొడవ చేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఇంటికి చేరుకున్నారు. బాలికకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయినా ఆమె పట్టు వీడక పోవడంతో చట్టప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి బాలిక మేజర్‌ అవుతుందని, అప్పటి వరకు ఆమెను తిరుపతిలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికా సంరక్షణ కేంద్రంలో ఉంచాలని నిర్ణయించారు.

More Telugu News