Haryana: పావులు కదుపుతున్న బీజేపీ.. హర్యానా ముఖ్యమంత్రిగా ఖట్టర్ నేడు ప్రమాణ స్వీకారం?

  • అధికారానికి 6 సీట్ల దూరంలో నిలిచిపోయిన బీజేపీ
  • 40 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరణ
  • ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలంటూ గవర్నర్ ను కోరనున్న బీజేపీ

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారాన్ని చేపట్టే మెజార్టీ రాలేదు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను... 46 సీట్లను గెల్చుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కానీ, అధికార బీజేపీ 40 సీట్ల వద్దే ఆగిపోయింది. కాంగ్రెస్ 31 స్థానాలను గెలుచుకోగా, జేజేపీ 10, ఇతరులు 9 స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో, జేజేపీతో పాటు, తమతో కలసివచ్చే ఇండిపెండెంట్లను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలాకు సీఎం పదవిని కాంగ్రెస్ ఆఫర్ చేసింది.

మరోవైపు, ఈరోజు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ఆయన.... బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. పార్టీ ఇతర కీలక నేతలను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది.

ఆ తర్వాత హర్యానా శాసనసభ బీజేపీ పక్ష నేతగా ఖట్టర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ ను కలిసి... ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. దీపావళి తర్వాత కేబినెట్ ఏర్పాటు ఉంటుందని చెబుతున్నారు.

మరోవైపు, అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం ఉన్న నేపథ్యంలో, బీజేపీ అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. ఓ వైపు దుష్యంత్ తో చర్చలు జరుపుతూనే, ఇండిపెండెంట్లను ఆకర్షించేందుకు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

More Telugu News