Crime News: పార్టీల మధ్య చిచ్చుపెట్టి స్నేహితుడిని బుక్‌ చేయాలనుకున్నాడు...తానే బుక్‌ అయ్యాడు!

  • అప్పు విషయంలో విభేదాలతో స్నేహితుడిపై కక్ష
  • సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టింగ్‌లతో వ్యూహం
  • పోలీసుల రంగప్రవేశంతో బెడిసికొట్టిన ప్లాన్‌

అమ్మో...వీడు సామాన్యుడు కాదు. రాజకీయ పార్టీల జోలికి వెళ్లాలంటే పెద్ద స్థాయిలో ఉన్నవారే భయపడతారు. అలాంటిది సాధారణ వ్యక్తి ఎంతకు తెగించాడో చూడండి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్‌ల ద్వారా టీడీపీ, వైసీపీ మధ్య చిచ్చురేపి, దాన్ని స్నేహితుడిపైకి తోసేసి ఇరికించేందుకు పథకం వేశాడు. అదికాస్తా బెడిసికొట్టడంతో తానే దొరికిపోయాడు.

పోలీసుల కథనం మేరకు... అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ కేఫ్‌ నిర్వాహకుడు రామ్మోహన్‌, పక్కనే ఉన్న గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ స్నేహితులు. చంద్రశేఖర్‌కు రామ్మోహన్‌ రూ.10 వేలు అప్పుగా ఇచ్చాడు. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో రామ్మోహన్‌ని పోలీసులు కేసులో ఇరికించాలని చంద్రశేఖర్‌ పథకం రచించాడు.

ఇందులో భాగంగా రామ్మోహన్‌కి తెలియకుండా అతని సెల్‌ఫోన్‌ నుంచి తన సెల్‌ ఫోన్‌కి టీడీపీ, వైసీపీకి సంబంధించిన కొన్ని పోస్టులు పంపించాడు. వాటికి సంభాషణలు, స్క్రీన్‌షాట్‌లు జోడించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే ప్రధాన పార్టీల మధ్య గొడవ మొదలవుతుందని, పోస్టింగ్స్‌కి కారణమైన వారిపై ఆరాతీస్తే రామ్మోహన్‌ ఇరుక్కుంటాడని చంద్రశేఖర్‌ ప్లాన్‌ చేశాడు.

దీన్ని పోలీసులు ముందే గుర్తించడంతో చంద్రశేఖర్‌ పథకం బెడిసికొట్టింది. అతన్ని అదుపులోకి తీసుకుని రామ్మోహన్‌ను బెదిరించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News