bengaluru: ఏడేళ్ల సహజీవనం తర్వాత తెలిసిన అసలు నిజం.. బంజారాహిల్స్ పోలీసులకు బెంగళూరు మహిళ ఫిర్యాదు

  • మాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమైన యువకుడు
  • పలువురు మహిళలతో సంబంధాలు
  • విషయం తెలిసి దూరంపెట్టిన మహిళ

ఏడేళ్ల సహజీవనం తర్వాత అతడికి పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆమెకు తెలిసింది. దీంతో అతడిని దూరం పెట్టింది. ఇటీవల ఆమెకు ఫోన్ చేసిన అతడు తనకు కారు అవసరం ఉందని చెప్పి తీసుకెళ్లాడు. తిరిగి అడిగితే బెదిరించాడు. ఆపై కారుతో ఉడాయించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఓ మహిళకు మాట్రిమోనీ సైట్ ద్వారా రాహుల్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి 2011లో పరిచయం అయ్యాడు. తాను అనాథనని, వ్యాపారాలు ఉన్నాయని చెప్పి ఆమెకు దగ్గరయ్యారు. దీంతో 2012 నుంచి సహజీవనం చేస్తున్నారు.

ఇటీవల అతడి గురించి ఆమెకు ఓ నిజం తెలిసింది. అతడికి పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నట్టు తెలుసుకుంది. దీంతో  అతడిని దూరం పెట్టింది. ఈ క్రమంలో ఈనెల 5న బెంగళూరులో ఉన్న ఆమెకు ఫోన్ చేసిన రాహుల్... తనకు కారు అవసరం ఉందని చెప్పి డ్రైవర్‌తో కారును తెప్పించుకున్నాడు. నాలుగు రోజులైనా కారు వెనక్కి ఇవ్వకపోవడంతో ఆమె ఫోన్ చేసి అడగడంతో రాహుల్ బెదిరించాడు. దీంతో అతను హైదరాబాదు, బంజారాహిల్స్‌లోని డౌన్‌టౌన్ హోటల్‌లో వున్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లి కారును వెనక్కి ఇవ్వమని కోరింది. ఆమెను మరోమారు బెదిరించిన రాహుల్ కారుతో ఉడాయించాడు. దీంతో బుధవారం రాత్రి ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాహుల్ కోసం గాలిస్తున్నారు.

More Telugu News