tsrtcr: ఆర్టీసీ కార్మికులు ఎంచుకున్నది పిచ్చి పంథా: సీఎం కేసీఆర్ విమర్శ

  • నాలుగేళ్లలో 67 శాతం జీతాలు కార్మికులకు పెంచాం
  • ఇంకా గొంతెమ్మ కోరికలు కోరడంలో అర్థముందా?
  • రాష్ట్ర ప్రభుత్వానికి 57 కార్పొరేషన్లు ఉన్నాయి

టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి ప్రశ్నించగా కేసీఆర్ స్పందిస్తూ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గురించి తన కన్నా బాగా తెలిసిన వ్యక్తి మరొకరు ఉంటారని అనుకోనని అన్నారు.

ఆ సంస్థ పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని, ఎందుకంటే, గతంలో మూడు సంవత్సరాలు రవాణా శాఖ మంత్రిగా పనిచేశానని అన్నారు. ఆ రోజు ఆర్టీసీ సంస్థ పదమూడు కోట్ల ఎనభై లక్షల నష్టంలో ఉందని, తాను ఎంతో ఆలోచన చేసి సంస్థను లాభాల బాటపట్టేలా చేసి దాన్ని కాపాడానని, ఈ విషయం అందరికీ తెలుసని అన్నారు.

అనంతర కాలంలో తాను సీఎం అయ్యానని, ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించానని, ఎలా బాగుపడాలో వాళ్లకు సలహాలు చెప్పానని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో  67 శాతం జీతాలు కార్మికులకు పెరిగాయని వివరించారు.

భారతదేశ ఆర్టీసీ చరిత్రలో కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఇంత శాతం జీతాలు పెంచిన చరిత్ర ఉందా? ఆ ప్రకారం కార్మికులకు జీతాలు రాలేదా? అని ప్రశ్నించారు. ఇంత చేసిన తర్వాత కూడా ‘ఇంకా మేము గొంతెమ్మ కోరికలు కోరతామంటే, అర్థముందా? అని ప్రశ్నించారు. ఎవరుబడితే వాళ్లొచ్చి తమను ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నారని, అలా చేస్తామా? అది అంత తేలికా? అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి 57 కార్పొరేషన్లు ఉన్నాయని, ఒకవేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, మిగిలిన కార్పొరేషన్ల వాళ్లూ ఇదే బాట పడితే ఏం సమాధానం చెప్పాలి? ఇష్టమున్నట్టు మాట్లాడటమేనా? అని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమన్న అసంబద్ధమైన, అర్థరహితమైన, అసంభవమైనటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారని, ఆర్టీసీ కార్మికులు పిచ్చి పంథాను ఎన్నుకున్నారని విమర్శించారు.

More Telugu News