shiv sena: శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయం: ఎన్సీపీ అధినేత శరద్ పవార్

  • మా భవిష్యత్ కార్యాచరణపై మిత్రపక్షాలతో చర్చిస్తాం
  • మా పార్టీని వీడిన వారు ఓడారు
  • వారికి ఫిరాయింపులు ఏ మేలూ చేయలేకపోయాయి

మహారాష్ట్రలో ఎన్నికల్లో తమ కూటమి ఓటమిని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అంగీకరించారు. బీజేపీ, శివసేన కూటమి విజయం దిశగా దూసుకుపోతోన్న విషయం తెలిసిందే.  

ఈ నేపథ్యంలో శివసేనతో తాము కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై వస్తున్న ప్రచారంపై శరద్ పవార్ స్పందించారు. 'మేము శివసేనతో కలవబోము. మా భవిష్యత్ కార్యాచరణపై ఎన్సీపీ, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు చర్చించి, నిర్ణయం తీసుకుంటాయి' అని మీడియాకు తెలిపారు.  

తమ పార్టీని వీడి బీజేపీలో చేరిన వారిపై శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. తమ పార్టీని వదిలి వెళ్లిన వారిని ప్రజలు మళ్లీ గెలిపించలేదని అన్నారు. వారికి ఫిరాయింపులు ఏ మేలూ చేయలేకపోయాయని తెలిపారు. అధికారంలో ఉన్న వారి అహంకారాన్ని ప్రజలు ఉపేక్షించబోరని ఈ ఫలితాలు తెలుపుతున్నాయని వ్యాఖ్యానించారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 102, శివసేన 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఆ ఇరు పార్టీలు కలిపి 163 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

 మరోవైపు ఎన్సీపీ అభ్యర్థులు 54, కాంగ్రెస్ అభ్యర్థులు 41, స్వతంత్ర అభ్యర్థులు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోవడంతో ఎన్నికల అనంతరం బీజేపీ.. శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం శివసేనతో కలిసి పోటీ చేసింది.

More Telugu News