javadekar: ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీదే విజయం: కేంద్ర మంత్రి జవదేకర్ జోస్యం

  • ప్రజలకు మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంది
  • రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేశాయి
  • మోదీ ప్రభుత్వం సులభతర విధానాలు అమలు చేస్తోంది
  • అందుకే సులభతర వాణిజ్యంలో భారత్ ర్యాంకు మెరుగుపడింది

మరి కొన్నినెలల్లో జరగనున్న ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీయే విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, శివసేన కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ... '2014 ఎన్నికల తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు మాకు మరింత మెజార్టీని కట్టబెట్టారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పని చేస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానాలో విజయం సాధిస్తున్నాం. జార్ఖండ్, ఢిల్లీలోనూ విజయం సాధించబోతున్నాం' అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకం ఉందని, ఆ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేశాయని అన్నారు.

సులభతర వాణిజ్యంలో మరో 14 స్థానాలు మెరుగుపర్చుకున్న భారత్ 63వ ర్యాంకుకు ఎగబాకిన విషయంపై జవదేకర్ స్పందిస్తూ... 'ప్రధాని మోదీ ప్రభుత్వ సులభతర విధానాల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు, వ్యాపారాలకు భారత్ ఓ చక్కటి గమ్యస్థానంగా మారింది. నిజమైన సులభతర వాణిజ్య విధానాన్ని భారత్ అమలు చేస్తోంది. అన్ని సదుపాయాలను అందిస్తూ దేశంలో జీవన విధానాన్ని సులభతరం చేస్తోంది.  అందుకే, పెట్టుబడులు పెట్టడానికి విదేశీయులు ఇతర దేశాలను కాదని భారత్ వైపు చూస్తున్నారు. 2014లో మన దేశం సులభతర వాణిజ్య విధానంలో 142వ స్థానంలో ఉంది. గతేడాది 77వ స్థానంలో ఉంది. ఇప్పుడు 63వ ర్యాంకుకు ఎగబాకాం' అని వ్యాఖ్యానించారు.

More Telugu News