High Court: సామాన్యులకు సమస్యలు వస్తే చూస్తూ ఊరుకోం: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

  • అంతంత మాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు
  • ఐఏఎస్ లు కనీసం పత్రికలు కూడా చదువుతున్నట్లు  లేదు
  • ఇక నుంచి సుమోటాగా కేసులు స్వీకరించాల్సి వస్తుంది 

తెలంగాణలో డెంగ్యూ నివారణకు చేపట్టిన చర్యలపై ఈ రోజు హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు పలువురు అధికారులు సర్కారు తరఫున కోర్టుకు హాజరయ్యారు. డెంగ్యూ నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతంత మాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారని చివాట్లు పెట్టింది.

ఐఏఎస్ లు కనీసం పత్రికలు కూడా చదువుతున్నట్లు  లేదని హైకోర్టు చెప్పింది. సామాన్యులకు సమస్యలు వస్తే న్యాయస్థానం చూస్తూ ఊరుకోదని, ఇక నుంచి సుమోటాగా కేసులు స్వీకరించాల్సి వస్తుందని హెచ్చరించింది. నిర్లక్ష్యం చేస్తే ఉన్నతాధికారుల జేబుల నుంచి బాధితులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

డెంగ్యూ నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినా చలనం లేదని హైకోర్టు పేర్కొంది. కాగా, తెలంగాణలో డెంగ్యూ జ్వరాల తీవ్రత, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే.

More Telugu News