Infosys: కష్టాల్లో ఇన్ఫోసిస్... దర్యాఫ్తు ప్రారంభించిన సెబీ!

  • సీఈఓ, సీఎఫ్ఓలపై కొందరు ఉద్యోగుల ఫిర్యాదు
  • ప్రాధమిక విచారణ ప్రారంభించిన సెబీ
  • దావా వేసేందుకు సిద్ధమవుతున్న అమెరికన్ ఇన్వెస్టర్లు
  • తాము కూడా విచారిస్తున్నామన్న నందన్ నిలేకని

సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో ఆదాయాలను, నికర లాభాలను తప్పుగా చూపుతున్నారని అందుకు సీఈఓ సలిల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ లు కారణమని ఆరోపిస్తూ, కొందరు ఉద్యోగుల బృందం రాసిన లేఖ, ఐటీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలకు కారణంకాగా, సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ప్రాథమిక విచారణను ప్రారంభించింది. ఇప్పటికే ఉద్యోగుల బృందం నుంచి తామందుకున్న లేఖలను, కొన్ని వాయిస్ రికార్డులను, ఈ-మెయిల్స్ ను సెబీ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని ఆంగ్ల పత్రిక 'బిజినెస్ స్టాండర్డ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఉద్యోగులు చేసిన ఆరోపణల్లోని తీవ్రత దృష్ట్యా, దర్యాఫ్తు చేయాలని భావిస్తున్నట్టు సెబీ అధికారులు తెలిపారు. మరోవైపు యూఎస్ లో సైతం ఇన్ఫోసిస్ లిస్టింగై ఉండటంతో, అక్కడికీ ఫిర్యాదులు వెళ్లాయి. వీటిని అందుకున్న అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సైతం రంగంలోకి దిగింది. కేసు విచారణలో సెబీ, ఎస్ఈసీలు కలిసి పని చేయనున్నాయి.

మరోవైపు ఇన్ఫోసిస్ షేరు విలువ అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనం కావడంతో, ఇన్వెస్టర్లకు ఏర్పడిన నష్టాన్ని రికవరీ చేసుకునేందుకు యూఎస్ కు చెందిన రోజెన్ లా ఫిమ్, క్లాస్ యాక్షన్ సూట్ వేయాలని నిర్ణయించుకుంది. ఎన్ వైఎస్సీ (న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్)లోనూ ఇన్ఫీ ఈక్విటీలు ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులు రాసిన లేఖ బయటకు వచ్చిన తరువాత, ఇన్ఫోసిస్ ఏడీఆర్ విలువ కుప్పకూలింది.

మరోవైపు ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాఫ్తును జరుపుతున్నామని ఇన్ఫోసిస్ చైర్మన్, కో-ఫౌండర్ నందన్ నిలేకని ఇప్పటికే వెల్లడించారు. ఫిర్యాదులపై తమకు ఎటువంటి వాయిస్ రికార్డులు, ఈ-మెయిల్స్ అందలేదని, అయినా దర్యాఫ్తు ప్రారంభించామని తెలిపారు. దర్యాఫ్తు పారదర్శకంగా సాగేందుకు సీఈఓ, సీఎఫ్ఓలను దూరం పెట్టామని, మొత్తం అంశంపై ఇన్ఫీకి ఆడిటర్ సంస్థగా వ్యవహరిస్తున్న డెల్లాయిట్ కు సమాచారం ఇచ్చామని నిలేకని తెలిపారు.

More Telugu News