TSRTC: సీఎం సారూ...ఇదేనా బంగారు తెలంగాణ?: ఆర్టీసీ ఉద్యోగి కుమార్తె ప్రశ్న

  • జీతం లేక నా ఫీజులు కూడా నాన్న కట్టలేదు
  • ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు
  • ఇంకా ఎంతమంది చనిపోతే స్పందిస్తారో కేసీఆర్‌ చెప్పాలి

ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం తీరు నేపథ్యంలో ఓ ఆర్టీసీ ఉద్యోగి కుమార్తె ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘మీరు తెస్తామన్న బంగారు తెలంగాణ ఇదేనా?’ అని సూటిగా ప్రశ్నించింది. బంగారు తెలంగాణ అంటే ఉద్యోగాలు ఇవ్వాలిగాని, ఉన్న ఉద్యోగాలను తీసేయడం కాదని విమర్శించింది.

ఈరోజు ఆమె ఓ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ సమ్మె సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలం కావడం వల్ల తన లాంటి చాలా మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. సమ్మె కారణంగా సంస్థ జీతాలు చెల్లించకపోవడంతో తన కాలేజి ఫీజులు తండ్రి కట్టలేకపోయారని కన్నీటిపర్యంతమయింది.

ఇప్పటికే కొంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇంకా ఎంతమంది చనిపోతే ముఖ్యమంత్రి స్పందిస్తారో తెలియజేయాలని నిలదీసింది. ‘తమ సమస్యలు పరిష్కరించాలనే కదా కార్మికులు అడుగుతున్నారు. ఏం తప్పు చేశారని మా అమ్మానాన్నలను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు?’ అంటూ నిలదీసింది.

సమ్మె మొదలైనప్పటి నుంచి తన తల్లి ఒక్కరోజు కూడా సరిగా భోజనం చేయలేదని, తమ భవిష్యత్తు ఏమవుతుందో అని కుంగిపోతోందని కన్నీరుపెట్టింది. 

More Telugu News