zomato: హిందూ సమాజ్ పార్టీ నేత హత్య కేసు: జొమాటోలో డెలివరీ బాయ్ గా పని చేసిన నిందితుడు

  • భద్రతకు హామీ ఇవ్వాలంటున్న వినియోగదారులు
  • స్పందించిన జొమాటో
  • ‌తమది బాధ్యతాయుతమైన కంపెనీ అన్న జొమాటో

ఉత్తర్ ప్రదేశ్ లోని హిందూ సమాజ్‌ పార్టీ నేత కమలేశ్ తివారీ దారుణ హత్యకు గురి కావడం ఇటీవల సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో దర్యాప్తు జరుపుతోన్న పోలీసులు రాజస్థాన్ సరిహద్దుల్లో నిందితులు అష్ఫఖ్ హుస్సేన్, మొయినుద్దీన్ పఠాన్‌లను అరెస్టు చేశారు. అయితే, వీరిలో మొయినుద్దీన్ జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడని పోలీసులు గుర్తించారు. దీనిపై జొమాటో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటువంటి క్రూరమైన మనస్తత్వం ఉన్నవారిని పనిలో పెట్టుకున్నారని, తమ భద్రతకు హామీ ఇవ్వాలని తమను కస్టమర్లు డిమాండ్ చేస్తుండడంతో జొమాటో ప్రతినిధులు స్పందించారు.  మొయినుద్దీన్ పఠాన్.. ఈ ఏడాది ఆగస్ట్ 17న సూరత్‌లో తమ సంస్థలో చేరాడని వివరించారు. అతడి ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, గత కోర్టు రికార్డులను ఓ సంస్థ ద్వారా పరిశీలన చేయించిన తర్వాతే పనిలో పెట్టుకున్నట్లు చెప్పారు.

అతను చివరిసారిగా అక్టోబరు 6న డెలివరీ చేసినట్లు జొమాటో ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత అతడు మానేసినట్లు చెప్పారు. తమ సంస్థ చట్టానికి కట్టుబడి ఉంటుందని, తమది బాధ్యతాయుతమైన కంపెనీ అని చెప్పుకొచ్చారు. ఈ కేసు దర్యాప్తులో సహకరిస్తామని ఇప్పటికే అధికారులకు తెలిపామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిని సహించబోమని అన్నారు. జొమాటో కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పుకొచ్చారు.

More Telugu News