Nara Lokesh: కార్యకర్తల కోసం ఎంత చేసినా తక్కువే: నారా లోకేశ్

  • 60 లక్షల మంది కార్యకర్తలే టీడీపీకి బలం, ధైర్యం, సైన్యం
  • కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాదబీమా పథకం అమలు చేస్తున్నాం
  • ప్రపంచంలోనే కార్యకర్తల కోసం ఇలాంటి పథకం లేదు
  • ఐదేళ్లలో రూ.80 కోట్లను బీమా పరిహారంగా చెల్లించడం జరిగింది

తమ పార్టీ కార్యకర్తల సంక్షేమమే తమ లక్ష్యమని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. తమ కార్యకర్తలకు అమలు చేస్తోన్న రూ.2 లక్షల ప్రమాద బీమా పథకం ద్వారా ఐదేళ్లలో చేసిన చెల్లింపులపై ఆయన ట్విటర్ లో వివరాలు తెలిపారు. 'టీడీపీ జెండాను తమ భుజాలపై మోస్తూ, కుటుంబ సౌఖ్యాలను కూడా పక్కన పెట్టి అన్ని వేళలా పార్టీని కంటి రెప్పలా కనిపెట్టుకుని ఉంటారు కార్యకర్తలు. దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలే టీడీపీకి బలం, ధైర్యం, సైన్యం. పార్టీకి  వెన్నెముకలాంటి కార్యకర్తల కోసం ఎంత చేసినా తక్కువే' అని పేర్కొన్నారు.

'అలాంటి కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏమిటన్న ఆలోచనతో తెచ్చిందే 'కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాదబీమా పథకం'. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కార్యకర్తల కోసం ఇలాంటి పథకాన్ని ఏ రాజకీయ పార్టీ తీసుకురాలేదు. ఇలాంటి ఒక పథకాన్ని పెట్టడమే కాకుండా ఎంతో చిత్తశుద్ధితో, సమర్థవంతంగా అమలుచేస్తున్న పార్టీ కూడా టీడీపీనే. గత ఐదేళ్లలో ప్రమాదాల్లో మరణించిన 4,000 మంది టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.80 కోట్లను బీమా పరిహారంగా చెల్లించడం జరిగింది. కార్యకర్తల సంక్షేమమే మా లక్ష్యం' అని లోకేశ్ తెలిపారు.

More Telugu News