Police: మంచి ఉద్యోగమని చెప్పి తప్పుడు పనులు చేయిస్తున్నారు... డీసీపీని ఆశ్రయించిన ఇద్దరు హైదరాబాద్ యువతులు!

  • అమీర్ పేట, జయశ్రీ స్పాలో ఉద్యోగం
  • క్రాస్ మసాజ్ చేయించిన నిర్వాహకుడు
  • సుమతి ఆదేశాలతో కేసు నమోదు
  • ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

మంచి ఉద్యోగమని, నెలకు రూ. 18 వేలు వేతనమని చెప్పి పనిలో పెట్టుకుని, తమతో తప్పుడు పనులు చేయిస్తున్నారని ఆరోపిస్తూ, హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువతులు వెస్ట్ జోన్ డీసీపీ సుమతిని ఆశ్రయించారు. ఆమె ఆదేశాల మేరకు, వెంటనే కేసు నమోదు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు ప్రకాశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, అమీర్ పేట పరిధిలోని ధరమ్ కరమ్ రోడ్డులో ప్రకాశ్, జయశ్రీ ఆయుర్వేదిక్ స్పా సెంటర్ ను నిర్వహిస్తూ, తన వద్ద పని చేసేందుకు యువతులు కావాలని ప్రకటనలు ఇచ్చాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు, ఉద్యోగం కావాలని రావడంతో, వారిని పనిలో పెట్టుకున్నాడు.

నెలకు రూ. 18 వేలు వేతనమిస్తానని చెప్పిన ప్రకాశ్, వారితో క్రాస్ మసాజ్ చేయించి రూ. 500 చొప్పున ఇచ్చేవాడు. అదేంటని ప్రశ్నించగా, కస్టమర్లకు సహకరిస్తే రోజుకు రూ. 3 వేల వరకూ వస్తుందని చెప్పాడు. అందుకు వారు నిరాకరించగా, అప్పటికే తీసి పెట్టుకున్న ఫోటోలను చూపించి, వాటిని బయట పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అతని బారి నుంచి తమకు విముక్తిని కలిగించాలని బాధితులు సుమతిని ఆశ్రయించడంతో కేసు నమోదైంది.

More Telugu News