కుమార్తెను చూడడానికి వచ్చి ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న తండ్రి

24-10-2019 Thu 10:00
  • అరకులోయలో చదువుతున్న విద్యార్థిని
  • కళాశాలకు వచ్చి వెళ్తుండగా ఢీకొట్టిన కారు
  • నుజ్జునుజ్జు అయిన రెండు కాళ్లు

కళాశాలలో చదువుతున్న కూతురి క్షేమసమాచారాలు తెలుసుకునేందుకు వచ్చిన తండ్రిని కారు ఢీకొట్టిన ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. ప్రమాదంలో కాళ్లు నుజ్జునుజ్జు కావడంతో హుటాహుటిన విశాఖలోని కేజీహెచ్‌కి తరలించారు.

వివరాల్లోకి వెళితే...విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం కండ్రూం గ్రామానికి చెందిన రైతు కొర్ర తుంనాథ్‌ కుమార్తె అరకులోయలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. కుమార్తెను చూసేందుకు తుంనాథ్‌ నిన్న సాయంత్రం కళాశాలకు వచ్చాడు. కూతురితో మాట్లాడిన అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు.

ఆటో ఎక్కుతుండగా పర్యాటకులతో వస్తున్న కారు ఇతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుంనాథ్‌ రెండు కాళ్లు కారు, ఆటో మధ్యన ఇరుక్కుని నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం తెలుసుకున్న కుమార్తె హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యింది. వెంటనే స్థానికుల సహాయంతో తొలుత అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పడంతో విశాఖనగరంలోని కేజీహెచ్‌కి తీసుకువెళ్లారు.