Krishna River: గంటగంటకూ పెరుగుతున్న వరద... కృష్ణమ్మ మహోగ్రరూపం!

  • శ్రీశైలానికి 4.35 లక్షల క్యూసెక్కులకు పైగా వరద
  • ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత
  • నదిలో వరద మరింతగా పెరిగే ప్రమాదం
  • తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జలసంఘం హెచ్చరిక

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. తుంగభద్ర, భీమా నదులు ఉరకలెత్తుతుండటంతో, నదిలో వరద గంటగంటకూ పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 4.35 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండగా, ఆ మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సముద్రంలోకి వెళుతోంది. ఇప్పటికే కృష్ణమ్మపై ఉన్న జలాశయాలన్నీ నిండుకుండల్లా ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

ప్రకాశం బ్యారేజ్ కి దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, డెల్టాలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తూ, మిగులు నీటిని 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నదిలో వరద మరింతగా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాగా, ప్రస్తుతం ఆల్మట్టికి 2.11 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ కు 3.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. మరోవైపు తుంగభద్రలో 1.44 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా, మంత్రాలయం, కర్నూలు వద్ద వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నేడు, రేపు కూడా భారీ వర్షాలకు అవకాశాలున్న నేపథ్యంలో నదిలో వరద మరింతగా పెరగవచ్చని కేంద్ర జలసంఘం తెలుగు రాష్ట్రాలను హెచ్చరించింది.

More Telugu News