piyush goyal: భవిష్యత్తులో రైళ్లలోనూ వైఫై: పీయూష్ గోయల్

  • భద్రత పరంగానూ చాలా ప్రయోజనాలు ఉంటాయి 
  • పోలీస్ స్టేషన్ లకు లైవ్ ఫీడ్ అందుతుంది 
  • మరో నాలుగున్నరేళ్లలో ఆ సదుపాయం కల్పిస్తాం 
  • ప్రయివేటు సంస్థలతో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు 

భవిష్యత్తులో రైళ్లలోనూ వైఫై సదుపాయం కల్పిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 'ఇది చాలా క్లిష్టమైన సాంకేతికతకు సంబంధించిన విషయం. ఇందుకోసం విదేశీ సాంకేతికత, పెట్టుబడులు అవసరం అవుతాయి. కదులుతోన్న రైళ్లలో వైఫై అందించడానికి పెట్టుబడులతో పాటు టవర్ల ఏర్పాటు, ఇందుకు తగ్గ సామగ్రి అవసరం ఉంటుంది' అని చెప్పారు.

'అయితే, రైళ్లలో వైఫై తీసుకొస్తే భద్రత పరంగానూ చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి కంపార్ట్ మెంట్ లోని సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీస్ స్టేషన్ లకు లైవ్ ఫీడ్ అందుతుంది. వైఫై ద్వారా ఇందుకు కావాల్సిన సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మరో నాలుగున్నరేళ్లలో రైళ్లలో వైఫై సదుపాయం అందిస్తాం. ప్రస్తుతం దేశంలోని 5,150 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందుతున్నాయి. ఈ ఏడాది చివరిలోగా ఈ సంఖ్యను 6,500కు పెంచడానికి ప్రయత్నిస్తున్నాం' అని గోయల్ తెలిపారు.

'ప్రయివేటు సంస్థల ద్వారా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను కొనసాగిస్తున్నాం. భోపాల్ లో ఇటువంటి విధానాన్నే అమలు చేస్తున్నాం. అక్కడి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దేశంలోని 13 రైల్వే స్టేషన్ల పరిధిలో ఆధునికీకరణ, షాపింగ్ మాల్స్ వంటి వాటిని అభివృద్ధి చేయడం కోసం నేషనల్ బిల్డింగ్స్ కన్స్ స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా పని చేస్తోంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే దేశ మంతటా వేగవంతంగా ఈ విధానాన్ని అమలు చేస్తాం. ఈ పనుల్లో ప్రైవేటు రంగంతో కలిసి పని చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి' అని పీయూష్ గోయల్ అన్నారు.

'దేశంలోని చాలా ప్రాంతాల్లో రైల్వే భూములకు భవిష్యత్తులో డిమాండ్ అధికంగా ఉంటుంది. రైల్వే భూములను సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం అధికంగా వినియోగిస్తాం. ప్రధాని మోదీ నాయకత్వంలో పనులు కొనసాగిస్తూ, భారత రైల్వేను ప్రపంచంలోనే కర్బన ఉద్గారాల వినియోగం లేని తొలి రైల్వే వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. అలాగే, రైల్వే భూములను పారిశ్రామిక పార్కుల కోసం వినియోగించాలని ప్రణాళికలు వేసుకుంటున్నాం' అని గోయల్ వివరించారు.    

More Telugu News