Brahmaputra: నవంబర్ 5 నుంచి బ్రహ్మపుత్ర నది పుష్కరాలు... టూర్ ప్యాకేజీల జోరు!

  • ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్న పుష్కరుడు
  • 12 రోజుల పాటు వైభవంగా పుష్కరాలు
  • పలు ప్యాకేజీలను ప్రకటిస్తున్న టూర్ సంస్థలు

ప్రతి సంవత్సరమూ ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. పుష్కరాలు ఏ నదికి వచ్చినా, ఉత్తరాది వారితో పోలిస్తే, దక్షిణాది వారు అత్యధికంగా వెళ్లి, నదిలో పుణ్య స్నానాలు చేసేందుకు ఆసక్తిని చూపుతుంటారు. ఇక ఈ సంవత్సరం పుష్కరుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు రానున్నాయి. నవంబర్ 5 నుంచి 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతాయి.

 బ్రహ్మపుత్ర నది ఇండియాలో అసోంలో ప్రవహిస్తుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గువహటి (గౌహతి) నగరాన్ని చీలుస్తూ సాగుతుంది. ఇక్కడే నది ఒడ్డున శక్తిపీఠమైన కామాఖ్య దేవి ఆలయముంది. శుక్లేశ్వర మందిరం, నవగ్రహ మందిరం, పికాక్‌ ఐలాండ్, డాన్‌బాస్కో మ్యూజియం, దక్షిణేశ్వర్‌ కాళీమాత తదితర ఆలయాలు అదనపు ఆకర్షణ. ఇంకాస్త ఓపిక ఉంటే షిల్లాంగ్ వరకూ కూడా వెళ్లి మంచుకొండల మధ్య ప్రవహించే బ్రహ్మపుత్రలో స్నానం చేసి రావచ్చు.

దీంతో పలువురు తెలుగు వారు పుష్కరాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటూ ఉండటంతో టూర్ ప్యాకేజీలు అందించే పలు కంపెనీలు, వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. 8 రోజుల టూర్ ప్యాకేజ్, 11 రోజుల టూర్ ప్యాకేజ్ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. గువహటి వరకూ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంది. నవంబర్ 5 నుంచి గువహటికి వెళ్లే విమానాలు ఇప్పటికే నిండిపోయినట్టు తెలుస్తోంది. ఇక కోల్ కతా మీదుగా గువహటికి వెళ్లే విమానాలకూ డిమాండ్ పెరుగుతోంది.

More Telugu News