సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్‌, పాక్ ల మధ్య నేరుగా చర్చలు జరగాలి: అమెరికా

23-10-2019 Wed 10:21
  • చర్చలు జరిగితే ఉద్రిక్తతలను తగ్గించవచ్చు
  • ఇరు దేశాల అధినేతలతో ఇప్పటికే ట్రంప్‌, పాంపియో మాట్లాడారు
  • ఉగ్రవాద సంస్థల చర్యలకు పాక్ బాధ్యత వహించాలి

సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య నేరుగా చర్చలు జరిగితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించవచ్చని అమెరికా సూచించింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగేందుకు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో.. ఇరు దేశాధినేతలతో మాట్లాడారని అమెరికా దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ కార్యదర్శి అలైస్‌ వెల్స్‌ అన్నారు.

పాక్ నుంచి కశ్మీర్‌లో హింసకు పాల్పడుతున్న ఉగ్రవాదులు తమ దేశానికి కూడా శత్రువులేనని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను అమెరికా స్వాగతిస్తోందని అలైస్‌ వెల్స్‌ చెప్పారు. వాస్తవాధీన రేఖ వద్ద హింసకు పాల్పడుతున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల చర్యలకు పాక్ బాధ్యత వహించాలని ఆమె అన్నారు. ఉగ్రవాదుల చర్యలను పాక్ నిరోధించడంపైనే భారత్, పాకిస్థాన్‌ల మధ్య చర్చలు జరిగే పరిస్థితులకు మార్గం సుగమం అయ్యే అంశం ఆధారపడి ఉంటుందని తెలిపారు.