బేగంపేటలో దారుణం.. నిద్రపోతున్న వాడిని లేపి మరీ తీసుకువెళ్లి హత్య!

23-10-2019 Wed 09:40
  • నిన్న తెల్లవారు జామున సెంట్రింగ్‌ కార్మికుడి హత్య
  • ఇంటి నుంచి అర కిలోమీటరు దూరంలో ఘాతుకం
  • సీసీ కెమేరా పుటేజీలో నిందితులను గుర్తించిన పోలీసులు

గుర్తు తెలియని వ్యక్తులు నిన్న తెల్లవారు జామున ఓ వ్యక్తిని అత్యంత కిరాతంగా హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని లేపి, అర కిలోమీటరు దూరం తమతోపాటు తీసుకువెళ్లి అక్కడ కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపారు. పోలీసుల కథనం మేరకు....హైదరాబాద్‌ బేగంపేటకు చెందిన మాజిద్‌ (40) సెంట్రింగ్‌ కార్మికుడు. సమీపంలోని విమలనగర్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు.

నిన్న తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు మాజిద్‌ ఇంటికి వచ్చారు. పనివుంది...రా అంటూ తమతోపాటు తీసుకువెళ్లారు. అర కిలోమీటరు దూరం వెళ్లాక కత్తులు, ఇతర మారణాయుధాలతో మాజిద్‌పై దాడి చేశారు. విచక్షణా రహితంగా నరకడంతో మాజిద్‌ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు.

ఉదయాన్నే మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. మాజిద్‌ ఇంటివద్ద, సంఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.