Dr Somaraju: పాతికేళ్ల అనుబంధానికి కట్... కేర్ ఆసుపత్రికి గుడ్ బై చెప్పిన డాక్టర్ సోమరాజు!

  • ఏఐజీలో చేరనున్న సోమరాజు
  • ఆయన ఆధ్వర్యంలో కార్డియాలజీ సేవలు
  • నిన్ననే కేర్ కు రాజీనామా
  • నవంబర్ 1 నుంచి ఏఐజీకి సోమరాజు

డాక్టర్ సోమరాజు... ఈ పేరు సామాన్యులకు పెద్దగా పరిచయం ఉండక పోవచ్చుగానీ, కార్పొరేట్, సినీ, రాజకీయ రంగాల్లోని ప్రముఖులందరికీ సుపరిచితుడు. ఎవరు గుండె సమస్యలతో బాధపడుతున్నా, గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరినా, తన హస్తవాసితో వారిని ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపిన ఘనత ఈయన సొంతం.

గడచిన 25 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఈయన, ఇప్పుడు మరో హాస్పిటల్ కు మారనున్నారు. ప్రస్తుతం కేర్ ఆసుపత్రుల గ్రూప్ చైర్మన్ పదవిలో ఉన్న డాక్టర్ సోమరాజు, తన పదవి నుంచి వైదొలగి, ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ)లో చేరనున్నారు. కేర్‌ లో తన బాధ్యతల నుంచి ఆయన మంగళవారం నాడు తప్పుకున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 1 నుంచి ఆయన ఏఐజీలో విధులకు హాజరవుతారని సమాచారం.

కాగా, కేర్ ఆసుపత్రుల విస్తరణలో డాక్టర్‌ సోమరాజు కీలక పాత్ర పోషించారు. కేర్ లో చేరడానికి ముందు ఆయన నిమ్స్‌ లో కార్డియాలజిస్టుగా పనిచేశారు. ఆ సమయంలో ప్రస్తుత ఏఐజీ అధినేత డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి కూడా నిమ్స్‌ లో విధుల్లో ఉండటంతో, అప్పటి వారి పరిచయం ఇప్పుడు కలసి సాగేలా చేసింది. ఇంతవరకూ జీర్ణకోశ వ్యాధులకు మాత్రమే చికిత్స చేస్తూ వచ్చిన ఏఐజీలో ఇకపై డాక్టర్ సోమరాజు ఆధ్వర్యంలో కార్డియాలజీ సేవలు కూడా ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

More Telugu News