TSRTC: తీవ్ర పని ఒత్తిడితో... ఆసుపత్రి పాలైన భద్రాచలం ఆర్టీసీ డీఎం!

  • గత 19 రోజులుగా డ్యూటీలో
  • కళ్లు తిరిగి పడిపోయిన బి.శ్రీనివాస్
  • స్వల్ప గుండెపోటుకు గురయ్యారన్న వైద్యులు

గడచిన 19 రోజులుగా తెలంగాణ ఆర్టీసీలో సమ్మె జరుగుతున్న నేపథ్యంలో, సమ్మెలో పాల్గొనకుండా విధుల్లో తలమునకలైన భద్రాచలం డిపో మేనేజర్, స్పృహ కోల్పోయి, ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్న భద్రాచలం ఆర్టీసీ డీఎం బి.శ్రీనివాస్ బుధవారం తెల్లవారుజామున కళ్లుతిరిగి పడిపోయారు. దీన్ని గమనించిన ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది, వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఆయన స్వల్ప గుండెపోటుకు గురైనట్టు గమనించిన వైద్యులు, ఈసీజీ తదితర టెస్టులు నిర్వహించారు. విశ్రాంతి లేని కారణంగానే, లో బీపీతో శ్రీనివాస్ స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. గడచిన రెండున్నర వారాలుగా ఆర్టీసీ బస్ స్టేషన్, బస్ డిపో నిర్వహణ బాధ్యతలు ఆయనే చూస్తున్నారు. ఇంటికి వెళ్లే సమయం కూడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి కుదుటపడిందని, చికిత్స జరుగుతోందని వైద్య వర్గాలు వెల్లడించాయి. తమ డిపో డీఎం సృహ కోల్పోయారన్న విషయం తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు, ఉద్యోగులు ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.

More Telugu News