అల్పపీడనం వాయుగుండం అవుతోంది... మరిన్ని రోజులు భారీ వర్షాలు!

23-10-2019 Wed 08:25
  • రేపటికి వాయుగుండంగా మారే అవకాశం
  • ఒకటి, రెండు చోట్ల కుంభవృష్టికి చాన్స్
  • హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు

పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని, నైరుతి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం, ఇప్పటికే తీవ్ర అల్పపీడనంగా మారిందని, గురువారం నాటికి అది వాయుగుండంగా బలపడే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు, కుంభవృష్టి కురిసే చాన్స్ ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఈ తీవ్ర అల్పపీడనం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ, ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వస్తోందని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, వాగులు, వంకలు, చిన్న నదుల్లోకి అకస్మాత్తుగా భారీ వర్షపు నీరు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలకూ అవకాశముందన్నారు. కాగా, అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో గత రాత్రి నుంచే ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు, వట్టి చెరుకూరు మండలాల్లో కుంభవృష్టి కురిసింది. దీంతో పత్తి, మిరప పొలాల్లోకి వర్షపు నీరు చేరగా, రైతుల్లో ఆందోళన మొదలైంది.