KCR: ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే చట్టాన్ని మోదీ ప్రభుత్వమే తీసుకొచ్చింది: కేసీఆర్

  • ఉన్నతాధికారులతో నాలుగు గంటల పాటు సమీక్ష
  • అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకోవడం సరికాదు
  • దిగ్విజయ్ హయాంలోనే మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీ మూతబడింది

ఆర్టీసీ రూట్లను ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారమిస్తూ మోదీ ప్రభుత్వమే చట్టం చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, కోర్టు ఆదేశాలపై మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఉన్నతాధికారులతో నిన్న సాయంత్రం సీఎం సుమారు నాలుగు గంటలపాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల చట్ట వ్యతిరేక సమ్మెకు కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతివ్వడం అనైతికమని పేర్కొన్నారు.  

మోదీ తీసుకొచ్చిన చట్టంలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు అవకాశం కల్పించారని, కేంద్రం తెచ్చిన చట్టాన్నే తాము ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నట్టు సీఎం కార్యాలయం తెలిపింది. ఈ విషయంలో బీజేపీ నేతల రాద్ధాంతం పనికి రాదని అన్నారు. మరోవైపు, ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్‌పై కూడా కేసీఆర్ మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్ సింగ్ హయాంలోనే ఆర్టీసీ మూతబడిన విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.

More Telugu News