Andhra Pradesh: వరదలు తగ్గగానే ఇసుక సరఫరా చేస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

  • వర్షాలు, వరదల కారణంగా ఇసుక సరఫరా సమస్య 
  • 10 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక నిల్వలు  పేరుకుపోయాయి
  • ఇసుక కొరతపై టీడీపీ నేతల విమర్శలు తగదు

ఏపీలో కొన్ని నెలలుగా ఉన్న ఇసుక కొరత తీరనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఏపీ సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వర్షాలు, వరదల కారణంగానే ఇసుక సరఫరా సమస్యగా మారిందని, వరదలు తగ్గగానే ఇసుక సరఫరాను పూర్తిస్థాయిలో చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ అంచనాల ప్రకారం పది లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక నిల్వలు ప్రతి నదిలో పేరుకుపోయాయని అన్నారు.

ఏడాదికి రెండు కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉందని, ఇప్పుడు పది కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక లభిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకూ ఆరు లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల ఇసుకను సరఫరా చేశామని వివరించారు. వరద తగ్గేలోపు సీసీ కెమెరాలు, వెయింగ్ బ్రిడ్జ్ లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇసుక కొరతపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఇసుకతో రాజకీయం చేశారని, ఆ ఇసుక కారణంగానే చంద్రబాబు ప్రభుత్వం కూలిపోయిందని అన్నారు.

More Telugu News