McAfee: ఆన్ లైన్ సెర్చింగ్ లో 'ధోనీ' పేరు యమ డేంజర్ అంటున్న మెకాఫీ

  • 'ధోనీ' సెర్చ్ రిజల్ట్స్ లో ప్రమాదకర సైట్లు
  • క్లిక్ చేస్తే ప్రమాదం అంటున్న మెకాఫీ
  • 'ధోనీ' తర్వాత 'సచిన్' పేరు

ఆన్ లైన్ ప్రపంచం విస్తరించాక వైరస్ లు, మాల్వేర్ల వంటి సైబర్ భూతాలు కూడా ఎక్కువయ్యాయి. కొన్ని లింకులు క్లిక్ చేస్తే సాలెగూట్లో చిక్కుకున్నట్టే. సాధారణంగా తమకు నచ్చిన సెలబ్రిటీల కోసం నెటిజన్లు ఆన్ లైన్ లో శోధించడం తెలిసిందే. అయితే, కొందరు ప్రముఖుల గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు వచ్చే సెర్చ్ రిజల్ట్స్ ప్రమాదకర వెబ్ సైట్లకు తీసుకెళతాయని, అవి నెటిజన్ల వివరాలు సేకరించి ఎంతో నష్టం కలుగజేస్తాయని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ చెబుతోంది. ఈ మేరకు మెకాఫీ ఓ నివేదిక విడుదల చేసింది. దానిప్రకారం, ధోనీ కోసం సెర్చ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

ధోనీ పేరు టైప్ చేస్తే వచ్చే సెర్చ్ రిజల్ట్స్ లో అత్యంత ప్రమాదకరమైన వైరస్ లు, మాల్వేర్లు కలిగిన వెబ్ సైట్ లింకులు ఉంటాయని వివరించింది. ఈ జాబితాలో ధోనీ తర్వాత రెండో స్థానంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరుంది. ఆపై బిగ్ బాస్ విన్నర్ గౌతమ్ గులాటీ, సన్నీ లియోన్, పాప్ సింగర్ బాద్షా, రాధికా ఆప్టే, శ్రద్ధా కపూర్, మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్, పీవీ సింధు, క్రిస్టియానో రొనాల్డో పేర్లు ఉన్నాయి. ఈ సెలబ్రిటీల గురించి సెర్చ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని  మెకాఫీ హెచ్చరించింది.

భారత్ లో సబ్ స్క్రిప్షన్ ఆధారిత కంటెంట్ వేదికలు ఎక్కువయ్యాయని, దాంతో రుసుము చెల్లించి వినోదం కొనుక్కోవడం ఇష్టంలేని నెటిజన్లు ఉచిత కంటెంట్ వేదికల కోసం వెదుకుతూ నష్టపోతున్నారని మెకాఫీ ఇండియా ఎండీ, ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ కృష్ణాపూర్ తెలిపారు.

More Telugu News